నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దుదాం
• నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్
• ప్రైవేటు సంస్థలకు ఎస్టీపీల నిర్వహణ
• ఖేలో ఇండియా పనులకు ప్రతిపాదనలు పంపండి
• గ్రీన్ సిటీ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయండి
• ఎస్‌ఎస్ ట్యాంకు వద్ద 135 ఎకరాల భూమికి సర్వే
నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బలమైన పునాదులు వేసేలా అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జమ్మిచెట్టు, సంకల్‌బాగ్, ఓల్డ్ పంప్‌హౌజ్‌ల వద్ద ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలు చేపట్టాలని సూచించారు. మరో ఎస్టీపీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన 5 మైదానాల్లో క్రీడా సౌకర్యాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీలో భాగంగా 5 పార్కులను అభివృద్ధి చేయడం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, ఓఆర్‌ఆర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
అదే విధంగా మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను పరిశీలించారు. అక్కడ నగరపాలక సంస్థకు చెందిన 135 ఎకరాల భూమిని సర్వే చేసి, రక్షణ వలయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. మాధవి నగర్ సమీపంలో తాగునీటి నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేసి, మామిదాలపాడులో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
కార్యక్రమంలో ఎస్ఈ శేషసాయి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, హార్టికల్చర్ ఏడి విజయలక్ష్మి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ గిరిరాజ్, నరేష్, గంగాధర్, క్రిష్ణలత, ఏఈలు ప్రవీణ్ కుమార్, వైష్ణవి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, సూపరింటెండెంట్ మంజూర్ బాష తదితరులు పాల్గొన్నారు.
Comment List