నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై వైద్యుల వివరణ
నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై వైద్యుల వివరణ
నంద్యాల ప్రతినిధి. సెప్టెంబర్ 16 . (నంది పత్రిక ):నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ వినోద్ కుమార్, వైద్యం అందించిన డాక్టర్ ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.ఈనెల 12వ తేదీ రాత్రి హాబీబా అనే 20 సంవత్సరాల గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం అడ్మిట్ చేయడం జరిగింది. డాక్టర్ ఫాతిమా ఎంబీబీఎస్ , ఎండీ స్త్రీ వ్యాధి గైనకాలజీ నిపుణురాలు నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ విభాగం వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ఫాతిమా చాలా సంవత్సరాల నుండి గైనకాలజీ నిపుణురాలుగా నంద్యాలలో సేవలందిస్తున్నారు. ఈ పేషెంట్ కు కూడా డాక్టర్ ఫాతిమా సాధారణ ప్రసవం కోసం 12వ తేదీ రాత్రి నుండి 13వ తేదీ సాయంత్రం వరకు ప్రయత్నించడం జరిగింది. సాధారణ ప్రసవం జరిగే అవకాశం లేకపోవడంతో రోగి బంధువులకు వివరించి 13వ తేదీ సాయంత్రం సిజేరియన్ ఆపరేషన్ బిడ్డను బయటకు తీయడం జరిగింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత అకస్మాత్తుగా తల్లి ఆయాస పడడం జరిగింది. దానికి సంబంధించిన వైద్యం చేస్తుండగా రోగి పరిస్థితి త్వరితగతిన తీవ్రం కావడంతో ఒక బాటిల్ రక్తం ఎక్కించి ,నాడి పడిపోతుండడంతో దానికి సంబంధించిన ఇంజక్షన్లు ఇచ్చి రోగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఎన్ఐఐటిసి ఐసీయూకి దగ్గరుండి తీసుకువెళ్లడం జరిగింది.
అక్కడ ఐసియు వైద్యులు రోగిని బ్రతికించడానికి అవసరమైన చికిత్సలన్ని చేసినప్పటికీ, రోగి పరిస్థితి క్రమేన ప్రమాదకర స్థితికి చేరుకుని మృతి చెందడం జరిగింది. పేషెంట్ మృతి చెందడం పట్ల తీవ్ర విచారాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నాం.
ఈ గర్భిణీ స్త్రీ కి ప్రసవం నిర్వహించడంలో గాని, సిజేరియన్ ఆపరేషన్ చేయడంలో, పేషెంట్ కు అకస్మాత్తుగా సమస్యలు ఉత్పన్నమైన సమయంలో వైద్య పరంగా చేయవలసిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఏ సమయంలో కూడా వైద్యులు నిర్లక్ష్యం చూపలేదు. నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ అరుణకుమారి ప్రధానంగా సంతానలేమి చికిత్సలు అందిస్తుండగా, ప్రసవాలు డాక్టర్ ఫాతిమా చేయడం జరుగుతున్నది. డాక్టర్ ఫాతిమా శిక్షణ పొందిన గైనకాలజీ స్పెషలిస్ట్ మరియు సుదీర్ఘకాలంగా అనుభవమున్న వైద్యురాలు.ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తమ దగ్గరికి వచ్చిన రోగికి మంచి చికిత్స అందించి బాగు చేయాలనే ప్రతి వైద్యుడు కోరుకుంటాడని ,అకస్మాత్తుగా చికిత్స సమయంలో రోగి పరిస్థితి తీవ్రమైనప్పుడు రోగి ప్రాణాలు కాపాడడం కోసం తన వంతు ప్రయత్న లోపం లేకుండా వైద్యం అందించడం జరుగుతుందన్నారు.కొన్నిసార్లు రోగి అంతర్గత అవయవాల స్థితిగతులను బట్టి, ఇదివరకే ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు, జబ్బు తీవ్రతను బట్టి, వైద్య ప్రయత్నాలు ఫలించక రోగి మృతి చెందడం జరుగుతూ ఉంటుంది. ఇది రోగి బంధువులకు తీవ్ర విచారాన్ని, ఆవేదనను కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. అదేవిధంగా వైద్యం అందిస్తున్న వైద్యులకు కూడా తమ దగ్గర చికిత్స పొందుతున్న రోగి మరణిస్తే వారికి కూడా ఎంతో విచారం, బాధా కలుగుతుంది. ఎంతోమంది రోగులకు మంచి చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన వైద్యులు, ఏదైనా ఒక రోగిని కాపాడలేని పరిస్థితి వస్తే , వెంటనే వారిపై తీవ్ర ఆరోపణలు చేయడం, చికిత్సలో లోపం జరిగిందని దుర్భాషలాడడం సరికాదన్నారు. తమ రోగికి అందించిన చికిత్సలో లోపం జరిగిందని భావిస్తే రోగి బంధువులు చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందన్నారు. అంతే గాని ఆవేశంలో వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు చేయడం, ఆసుపత్రి ఆస్తులు, పరికరాలు ధ్వంసం చేయడం సరికాదన్నారు.
Comment List