నిలచిపోయిన పాఠశాల నిర్మాణం

పంచాయతీలో బడి నిర్వహణ
మరుగుదొడ్లు లేక విద్యార్థుల అవస్థలు
బండి ఆత్మకూరు నంది పత్రిక నవంబర్ 14: విద్యా రంగం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నప్పటికీ వాటి అమలు తీరులో మాత్రం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలల అభివృద్ధి కొరకు నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ వాటిని ఖర్చు చేయడంలో మాత్రం విద్యాశాఖ అధికారుల వైఖరి మాత్రం అంతు పట్టడం లేదు. ఇందుకు ఉదాహరణగా బండి ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న సోమ యాజుల పల్లె గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ను ఉదాహరణగా పేర్కొనడంలో ఎలాంటి సందేహమే లేదు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. దీనితో గత రెండు సంవత్సరాలుగా గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని పాఠశాలగా మార్చుకొని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు బోధన చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం నాడు నేడు పథకం కింద పాఠశాల నిర్మాణానికి గాను లక్షలాది రూపాయలను మంజూరు చేశారు. పాఠశాల నిర్మాణం పిల్లర్స్ వరకే వచ్చి చాలా రోజులు అయిపోయింది. పాఠశాల నిర్మాణానికి వినియోగించాల్సిన సామాగ్రి తుప్పు పట్టిపోయింది. సిమెంట్ మూటలు గడ్డకట్టుకొని పోయి మూలన పడిపోయి ఎందుకు పనికి రాకుండా పోయాయి. పాఠశాలలో దాదాపు 54 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ బడిలో సరియైన సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు మరుగుదొడ్లు లేక బహిర్భూమిని వినియోగించుకుంటూ ఉండటం బాధాకరమైన విషయం. విద్యారంగం అభివృద్ధి విషయంలో పాలుపంచుకోవాలని ప్రత్యేకంగా పాఠశాల విద్యా కమిటీలను నియమించినప్పటికీ ప్రయోజనం శూన్యం. గ్రామపంచాయతీకి సర్పంచ్,ఉపసర్పంచ్ తో పాటు పాఠశాల కమిటీకి చైర్మన్ మహిలలే అయినప్పటికీ పాఠశాల నిర్వహణలో మాత్రం చొరవ చూపడం లేదన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. అప్పుడప్పుడు తనిఖీలకు వచ్చే విద్యాశాఖ అధికారికి ఈ పాఠశాల దుస్థితి కనపడడం లేదా అంటూ విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి చొరవ తీసుకొని విద్యార్థులకు మరుగుదొడ్ల వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comment List