గణేష్ నగర్ హత్య కేసులో నిందితురాలి అరెస్టు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలులోని గణేష్ నగర్లో ఈ నెల 1వ తేదీన జరిగిన కాటసాని శివలీల (75) హత్య కేసును కర్నూలు త్రీ టౌన్ పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితురాలు, ఇంట్లో పనిమనిషి అయిన కురువ వరలక్ష్మి (49)ని అరెస్టు చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. శివలీల ఇంట్లో పనిచేసే వరలక్ష్మి, ఆమెను రోకలిబండతో తలపై కొట్టి హత్య చేసిందని, ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న 11 తులాల బంగారు ఆభరణాలు, బ్యాంకు పాసుపుస్తకాలు, చెక్ బుక్లు తీసుకువెళ్లిందని తెలిపారు.
మెయిన్ రోడ్డులో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించినట్లు ఎస్పీ చెప్పారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండతో పాటు, చోరీకి గురైన ఆభరణాలు, బ్యాంకు పాసుపుస్తకాలు, చెక్ బుక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసును త్వరితగతిన చేధించిన కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, త్రీ టౌన్ సిఐ శేషయ్య, రూరల్ సిఐ చంద్రబాబు నాయుడు, మరియు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.
Comment List