నగరానికి ‘న్యూ లుక్’ తేవాలి
• మున్సిపల్ అధికారుల సమీక్షలో మంత్రి టీజీ భరత్
• ఆగస్టు ఆఖరు నాటికి పార్కులను తీర్చిదిద్దాలి
• రహదారులపై ఎక్కడా గుంతలు కనిపించకూడదు
• ప్రగతి పనులు పూర్తి చేయడంలో జాప్యం తగదు
నగరాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్ది ‘న్యూ లుక్’ తేవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నూతన కమిషనర్ పి.విశ్వనాథపై ఉన్నతాధికారుల్లో మంచి అభిప్రాయం ఉందని, పనితీరు బాగుంటుందని మంత్రి కితాబిచ్చారు. విశాఖపట్నం తరహాలో నగరాన్ని తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి సూచించారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తి అయిందని, ఇక మిగిలిన మూడున్నరేళ్ళలో, అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కాలయాపన చేయోద్దని స్పష్టం చేశారు. పనులకు భూమిపూజ చేసిన తర్వాత నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల పురోగతిపై మంత్రి ఆరా తీశారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని, పనులు పటిష్టంగా ఉండేందుకు ఇంకా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులను చేపట్టకుండా జాప్యం చేస్తున్న గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజ్ విహార్ సమీపంలోని ఎల్లమ్మ గుడి నుండి జమ్మి చెట్టు వరకు హంద్రీ నది ఒడ్డున నిర్మిస్తున్న రహదారి పనులను వేగవంతం చేయాలని, బండ్ మరింత పటిష్టంగా ఉండేందుకు జలవనరుల శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ రుసుముల మొండి బకాయిల వసూళ్లకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన నీటి ట్యాంకుల నాణ్యత సామర్థ్యాన్ని పరిశీలించాలని సూచించారు. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని, ఆగస్టు ఆఖరు నాటికి పార్కుల్లో మరమ్మత్తులు పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారులపై ఎక్కడా గుంతలు కనబడకుండా ఎప్పటికప్పుడు పూడ్చడానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. డిసెంబర్ నాటికి 30 వేల మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ హాల్స్‌లలో ఉన్న సచివాలయాను ఖాళీ చేసి, వాటి పైకి తరలించడం లేదా మరోచోటికి మార్చే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారుల విస్తరణ పనులు జాప్యం చేయొద్దని, స్థలం కోల్పోయే బాధితులతో త్వరితగతిన మాట్లాడి నష్టపరిహారం అందించాలని, త్వరగా విస్తరణ పనులను చేపట్టాలని ఆదేశించారు. వెండర్ జోన్లను సైతం ఆలస్యం చేయకుండా త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ జునైద్, ఇంచార్జీ ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ లీల ప్రసాద్, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, టిడ్కో అధికారి పెంచలయ్య, సూపరింటెండెంట్లు సుబ్బన్న, స్వర్ణలత, మంజూర్ బాష, కార్పొరేటర్ పరమేష్, తదితరులు పాల్గొన్నారు.
Comment List