సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ లో అధికారులు,సిబ్బంది దోపిడి.
-దోపిడీకి గురవుతున్న రైతన్నలు.
-ట్రాక్టర్ కు 50... కాటాకు 15 ఇచ్చుకోవాల్సిందే.
-మంచినీరు,వసతి లేక ఇబ్బందులు.
-ఒక్క రైతుకు మూడు రోజులకు 3 వేలు ఖర్చు
-ఖాళీ సంచులు ఇవ్వక ఇబ్బందులు.
నంద్యాల ప్రతినిధి. మే 01 . (నంది పత్రిక ):దేశానికి వెన్నెముక లాంటివారు రైతన్నలు అని ఏ ప్రభుత్వం వచ్చినా పొగడం తప్పా ఆచరణలో శూన్యం అని తెలుస్తోంది.గత కొద్ది రోజులుగా చామ కాల్వ నుంచి సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ వరకు జొన్న రైతుల ట్రాక్టర్లు నిలిచిపోవడంతో ఏమి జరుగుతుందని కె.ఎస్.కే.ప్రతినిధి అక్కడికి చేరుకున్నారు.రైతుల పరిస్థితి,అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది.సమస్యలు అడిగితే సమస్యలు చెప్పాలన్నా రైతులు,హమాలీలు భయపడుతున్నారంటే ఎంత బాధలు అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.అధికారులు రైతులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో సమస్య ఉత్పన్నం అవుతుంది.రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జొన్నల కు గిట్టుబాటు ధర కల్పించింది.నంద్యాల పార్లమెంట్ పరిధిలో నంద్యాల,గడివేముల,పాణ్యం,గోస్పాడు ప్రాంతాలకు చెందిన రైతులు తాము పండించిన జొన్నలు సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ కు తరలించడంతో సమస్య మొదలైంది.ఒకసారిగా నాలుగు మండలాల రైతులు రావడంతో హమాలీలు అధిక సంఖ్యలో లేక ఇబ్బందులు పడుతున్నారు.ఒక్క రైతు తమ కష్టాన్ని పంచుకున్నారు.ప్రభుత్వం జొన్న లకు గిట్టుబాటు కల్పించడంతో ట్రాక్టర్లు, లారీలతో తీసుకొచ్చాం అన్నారు.జొన్నలు కాటా వేసి దించడానికి మూడు రోజుల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ట్రాక్టర్ బాడుగ,డ్రైవర్,రైతు బోజనాలు,మంచి నీళ్లు ,మామూళ్ల కు ఒక్కొక్కరికి 3 వేలు ఖర్చు అవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.గోడౌన్ లోపల మంచినీళ్ళు పట్టుకుంటే సెక్యూరిటీ అరుస్తున్నాడు,మంచినీళ్ళు కూడా డబ్బులు పెట్టీ కొనాలి,వేసవి కాలంలో రైతులకు కనీసం భోజనం పెట్టకపోయినా మంచినీళ్ళు పెట్టడం లేదన్నారు.ఎండకు కూర్చునేందుకు కూడా వీలు లేదన్నారు.రాత్రి మా బాధ పగవాడికి కూడా వద్దన్నారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకొక్క వాహనానికి సెక్యూరిటీ సిబ్బందికి 50 ఇస్తున్నామని,కాటా కు 15 రూపాయలు ఇస్తున్నామని ఆరోపించారు.రైతు పేరు,విడియో తీసుకుందామని అడిగితే వద్దు నాయనో పేర్లు,విడియో ల్లో పడితే మాకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుందని కంట తడి పెట్టుకోవడం విశేషం.దూరంగా పోయి ఎండలో నీళ్ళు తెచ్చుకోలేక బయట చేతులు కడుక్కునే ట్యాంక్ ల వద్ద కొందరు రైతులు నీళ్ళు తాగడం దారుణం.ఆ ట్యాంక్ ల చుట్టూ చూస్తే దారుణం.ప్రతి మూడో శనివారం ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నట్టు కనిపించడం లేదు.ప్రభుత్వ ఆశయాలు కొన్ని కార్యాలయాల్లో నేటికీ జరగడం లేదని తెలుస్తోంది.రైతన్నల నోట అపర దాన కర్ణుడు దివంగత పార్లమెంట్ సభ్యులు ఎస్. పి. వై.రెడ్డి ఉంటే భోజనం,మజ్జిగ,మంచినీళ్ళు అందించారని ఆయనను గుర్తుతెచ్చుకున్నారు.రైతుల నుంచి దోపిడి అరికట్టాలని,మంచినీటి సౌకర్యం కల్పించాలని,హమాలీలు ఎక్కువ మందిని ఏర్పాటుచేయాలని రైతులు డిమాండ్ చేశారు.దయగల ధర్మాత్ములు రైతులకు మంచినీటి సౌకర్యం కల్పిస్తారని ఆశిద్దాం.
Comment List